ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి గ్రామంలో పంట పొలాల మధ్య పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
సుందరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఎం మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు, ఎస్‌విఎన్.శర్మ, సిర్రా నరసింహామూర్తులు అన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎస్‌విఎన్.శర్మ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన మజ్జిగను ఉపాధి హామీ కూలీలకు పంపిణీ చేసి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా నాయకులు ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్లే స్లిప్పులు ఇవ్వడంలేదని, పని ప్రదేశంలో టెంట్లు ఏర్పాటు చేయడం లేదని, ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని, తాగునీరు మజ్జిగ ఏర్పాటు చేయడం లేదని నాయకుల వద్ద కార్మికులు వాపోయారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాల మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పరువు మోహన్ రావు, నాయకులు తోటపల్లి సత్యనారాయణ, తలుపూరి బుల్లబ్బాయి, సిర్రా విగేశ్వరుడు, మానుకొండ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.










