May 08,2023 13:34

ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమగోదావరి) : ఏపీ సీడ్స్‌ కార్మికుల సమస్యలను తక్షణ పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ సీడ్స్‌లో టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐటియు నేతలు కార్మికులు నినాదాలు చేశారు. టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని, తొలగించిన కార్మికులను విధులలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ మాట్లాడుతూ తణుకు ఏపీ సీడ్స్‌లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెండర్‌ విధానాన్ని ప్రవేశపెట్టి కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమన్నారు. రాజకీయ వేధింపులతో కొంతమందిని తొలగించి కార్మికుల జీవితాలతో యాజమాన్యం ఆడుకుంటుందని విమర్శించారు. గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం గాని, ప్రజా ప్రతినిధులుగాని కనీసం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం ఆంజనేయులు, ఏపీ సీడ్స్‌ యూనియన్‌ నాయకులు టి రామకృష్ణ, త్రిమూర్తులు, జె సాంబశివరావు, బి శ్రీహరి, కే నరసింహారావు, కే శ్రీను జి శ్రీను, కే వెంకటరమణ, సూరిబాబు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.