Jun 20,2023 15:47

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం) : పోలవరం నిర్వాసితుల పోరు కేక మహాపాదయాత్ర పోస్టర్లను మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్‌ వద్ద సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్బంగా సిపిఎం మండల కార్యదర్శి పి.టి రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ... నెమలిపాక నుండి విజయవాడ వరకు జూన్‌ 20 నుండి జూలై 4 వరకు 15 రోజులు 400 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తునట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం పరిహారం ఇవ్వాలని.. 1986 నుండి 2022 వరకు వరదల్లో మునిగిన గ్రామాలు అన్నిటిని మొదటి దశ పునరావసములు కల్పించాలని.. గోదావరి వరదల నుండి రక్షించడానికి ప్రభుత్వాలు ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్‌తో ఈ యాత్ర సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి.పెద్దయ్య, కార్యదర్శి భాస్కర్‌, పూలరంగడు వెంకట చౌదరి, శివుడు, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.