Sep 30,2022 12:39

ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు) : పచ్చని ఏజెన్సీ ప్రాంతంలో ఆయుధ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు వెంటనే ఆపాలని సిపిఎం జీలుగుమిల్లి మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఆయుధ నిర్మాణ కేంద్రాన్ని ఆపాలని ఏపీ గిరిజన సంఘం, సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక సిపిఎం కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగింది. ' ఆదానీ రావద్దు తుపాకులు తేవద్దు వ్యవసాయమే ముద్దు తుపాకులు వద్దు ' గిరిజన చట్టాలు అమలు చేయలని నినాదాలు చేస్తూ మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశం వద్దకు చేరుకున్నారు. ఎంపీపీ కోర్స పోసమ్మకు ఆయుధ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే గిరిజనులకు గిరిజన పేదలకు జరిగే నష్టాన్ని వివరించారు. సర్వసభ్య సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు అంతా ఏకగ్రీవంగా నిర్మాణ కేంద్రాన్ని నిలుపుదల చేస్తూ తీర్మానం చేయాలని కోరారు. ఎంపీపీ పోసమ్మ సానుకూలంగా స్పందించి విషయం పై అధికారుల దఅష్టిలో పెడతానని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి తెల్లం.దుర్గారావు మాట్లాడుతూ... ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్‌ చింతలపూడి ఎత్తిపోతల పథకం పేరుతో గిరిజన చట్టాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనల్లో గిరిజనులపై ప్రేమ చూపిస్తూ ఆచరణలో గిరిజనులను ఏజెన్సీ నుంచి తరిమేసే చర్యలకు పూనుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన చట్టాలు ఉండగా గిరిజన ప్రాంతంలో ఆయుధ నిర్మాణ కేంద్రాన్ని ఎలా పెడతారని డిమాండ్‌ చేశారు. మండల కమిటీ సభ్యులు నేలటూరి అప్పారావు మాట్లాడుతూ... ఆయుధం రావడం వల్ల ఈ ప్రాంతంలో గిరిజనులతో పాటు అన్ని కులాల్లో ఉన్న పేదలకు చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత యువకుల నిరుద్యోగాన్ని ఆసరా చేసుకొని ఉద్యోగాలు కల్పిస్తామని భ్రమలు పెట్టి ఏజెన్సీని అదానికి కట్టబెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అదాని కంపెనీ కార్పొరేట్‌కే ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్థానిక గిరిజనులకు ఏమి వుండవని అన్నారు. వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు రాజమండ్రి దానియేలు, సిరిబత్తుల సీతారామయ్య, చిట్టి బమ్మ కొండల్‌ రావు, కల్లూరు దావీదు, గుండె గంగరాజు, కారం దుర్గ, వంకవారిగూడెం, తాటియ కులగూడెం, జీలుగుమిల్లి అంగన్నగూడెం, స్వర్ణవారిగూడెం, పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.