Mar 28,2023 15:44

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : అనంతపురం జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, దివంగత రాకెట్ల నారాయణరెడ్డి మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నీ మంగళవారం ఉరవకొండలో అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జెడ్పి చైర్‌ పర్సన్‌ గిరిజమ్మ, పార్టీ యువజన విభాగం జోనల్‌ అధ్యక్షుడు వై.ప్రణరురెడ్డి హాజరయ్యారు. ముందుగా నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి గత నాలుగేళ్లుగా నియోజకవర్గ స్థాయిలో నారాయణరెడ్డి మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నీ జరుపుతున్నామన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. అనంతరం టాస్‌ వేసి క్రికెట్‌ ఆడి టోర్నని ప్రారంభించారు. మొదటి బంతిని ప్రణరు రెడ్డి బౌలింగ్‌ చేయగా గిరిజమ్మ బ్యాటింగ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చంద్రమ్మ, కరణం పుష్పవతి భీమ్‌ రెడ్డి, జెడ్పిటిసిలు ఏసీ పార్వతమ్మ, హనుమంతు, సర్పంచ్‌ లలితమ్మ, ఉప సర్పంచ్‌ వన్నప్ప, కురుబ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ గోవిందు, పిఎసిఎస్‌ చైర్మన్లు తేజోనాథ్‌, శ్రీరాములు, టోర్నమెంట్‌ నిర్వాహకులు ధనరాజ్‌, మల్లికార్జున, నియోజకవర్గంలోని వైసిపి ప్రజాప్రతినిధులు,నాయకులు, టోర్నమెంట్‌ నిర్వాహక కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.