ప్రజాశక్తి-పలమనేరు(చిత్తూరు) : తెలుగువారి కీర్తిని దశదిశల చాటిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు అని పలమనేరు టిడిపి నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన స్మారకార్థం జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తూ వందరూపాయల నాణెంని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరులో సంబరాలు చేసుకున్నారు. స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద నున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన్ను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా పలువురికి స్వీట్స్ పంచి పెట్టి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సినిమా, రాజకీయ చరిత్రపై చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏదేమైనా ఎన్టీఆర్‌కు దక్కిన అరుదైన ఈ గౌరవం మనందరికి గర్వకారణమని ప్రతి తెలుగు వారు హర్షించదగిన విషయమన్నారు. తెలుగు భాషా దినోత్సవం రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందని వారు గుర్తు చేశారు. ఇక ఎన్టీఆర్ తనయుడు స్వర్గీయ హరికృష్ణ వర్ధంతి కావడంతో ఆయన పేరు మీదుగా నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్బిసి కుట్టి, నాగరాజు, సోమశేఖర్, మదన్, శ్రీధర్, మాబాషా, అమానుల్లా, లోకేష్, శ్రీనివాసులు, బాబాజాన్, నదీం, సురేంద్ర, వెంకటరమణ, పురుషోత్తం, ప్రమీల, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.










