Jul 21,2023 12:35

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు శుక్రవారం తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మద్దతు తెలిపారు. దీక్ష శిబిరం వద్ద కార్మికులను ఉద్దేశించి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ... రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ కార్మికులు 45, వేల నుండి 60 వేల కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మనెంట్‌ చేయలేదు అని విమర్శించారు. జీవో నెంబర్‌ 010 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని అన్నారు. అతి క్లిష్ట మైన కరోనా సమయంలో కార్మికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పనులను చేసినప్పటికీ, అదే సందర్భంలో ప్రభుత్వం కరోనా వారియర్స్‌ గా ప్రకటించింది కానీ అలాంటి కార్మికులను ఇంటికి పంపించడం జరిగిందన్నారు. వాళ్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని, వారిని పర్మినెంట్‌ కార్మికులుగా గుర్తించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంలో కార్మిక యూనియన్‌ నాయకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నాగరాజు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు మహబూబ్‌ బాషా, వెంకటేశులు, మాజీ కౌన్సిలర్లు హనుమంతు, పురుషోత్తం, జిల్లా ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.