
ఓ కుటుంబంలో పిల్లలు బాగా చదువుతున్నా, మార్కులు బాగా వస్తున్నాయంటే అందుకు వారి తల్లి విద్యావంతురాలై అయ్యి ఉంటుందని ఇంటర్‌జెనరేషన్ మొబిలిటీపై జరిగిన సర్వేలో నిపుణులు వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో సంవత్సరం పాటు జరిపిన ఈ పరిశోధనలో నిపుణులు ఊహించని ఫలితాలు కనిపించాయి. పిల్లల విద్యాభివృద్ధికి తండ్రి సహకారం ఉన్నా- చదువుకున్న తల్లి చూపే చొరవ వల్లే పిల్లలు క్లాసులో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని సర్వే తేల్చి చెప్పింది. అంటే కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి స్త్రీ ఉన్నత విద్య ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశోధనలు వెల్లడించాయి.
సహజంగా పుట్టిన బిడ్డ పట్ల తండ్రి కన్నా తల్లే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అది ఆమె బాధ్యత, పని అనుకుంటారు అందరూ. తల్లుల విద్య వారి పిల్లల భవిష్యత్తును కూడా రూపొందించడంలో శక్తివంతమైన పాత్రను కలిగి ఉందని ఇంటర్‌జెనరేషన్ మొబిలిటీపై గ్లోబల్ డేటాసెట్ పరిశోధనలో తేలింది.
పదేళ్ల క్రితం ఇదే అంశం మీద జరిపిన సర్వేలో తండ్రి బాగా చదువుకున్నట్లయితే అతని బిడ్డ విద్యాపరంగా కూడా విజయం సాధించే అవకాశం ఉందని చూపించింది. కానీ ఇప్పుటి పరిస్థితుల్లో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంది. దీనికి విరుద్ధంగా, తల్లుల విద్యా స్థితే వారి పిల్లల విద్యా స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతోంది.
అంతేకాకుండా పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో చదువుకుంటున్నారని సర్వే వివరించింది. యునైటెడ్ స్టేట్స్‌లో, 2019-2020లో విద్యలో 58 శాతం పురుషులు ఉండగా, 61 శాతం మహిళలు ఉన్నారు. 55 శాతం బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలను వరుసగా పొందారు. కెనడాలోనూ 2020లో మహిళలు పురుషుల కన్నా 60 శాతం ఎక్కువ బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. మహిళల విద్యలో పెరుగుదల తో విద్యావంతులైన తల్లులు తమ పిల్లలకు విజ్ఞానాన్ని, ఆర్థిక వనరులను సమకూర్చు తున్నారు. ఒంటరి తల్లులైనా తమ బిడ్డల చదువుకోసం లక్ష్య సాధనలో ముందుకెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యా జ్ఞానాన్ని కూడా అందజేస్తారు. ఇవన్నీ వారి పిల్లల విద్యా స్థితిని పెంపొందించడానికి సహాయపడతాయని సర్వే వివరించింది. ఉన్నత స్థాయిలో స్థిరపడిన వ్యక్తులను ప్రశ్నించగా...తమ తల్లులే మార్గదర్శులని సమాధానం చెప్పారు. వారి చదువుకు అమ్మలు ఏ విధంగా కష్టపడ్డారో వివరించారు.
పెద్ద గ్లోబల్ డేటాసెట్
ఇంటర్‌జెనరేషన్ ఎడ్యుకేషనల్ మొబిలిటీకి తల్లులు ఎలా ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డేటా సర్వే జరిపారు. ఆఫ్రికా, ఆసియా మరియు పసిఫిక్, యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని 106 సొసైటీల నుండి సర్వే చేయగా వచ్చిన ఫలితం, అప్పటికే ఉన్న 545 పెద్ద-స్థాయి సర్వేల డేటాను కలిపారు. 1956-1990 మధ్య జన్మించిన 18 లక్షల మంది వ్యక్తులు వారి తల్లి-తండ్రి విద్య ఆధారంగా తమ చదువు సాగిందని తెలిపారు. 2022లో 106 సంస్థలు ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం మందిని సర్వే చేయగా ఎక్కువగా తల్లి చదువు చెప్పినట్లు వెల్లడైంది.
డేటాసెట్‌ను విశ్లేషిస్తూ.. తల్లులు, తండ్రులు వారి పిల్లల విద్యా స్థితిని ఎలా ప్రభావితం చేస్తారో వారు పోల్చారు. తండ్రుల విద్య, వృత్తి, వనరులు ఆధారంగా కుటుంబ నేపథ్యం ఏర్పడుతుందని, సమాజంలో ఓ హోదా కోసం కృషి చేస్తారని చెప్పింది. అదే తల్లి అయితే తన బిడ్డల విద్యకు ఎంతో సహకరిస్తుందని, అందులోనూ ఉన్నత విద్య చదువుకున్న తల్లులు పిల్లల చదువుకు అన్ని విధాలా సహకరిస్తారని, మార్గదర్శకత్వానికి ఎక్కువ సమయం కేటాయిస్తారని వెల్లడైంది. బిడ్డల చదువు ద్వారా వారి భవిష్యత్తుని, తద్వారా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరిస్తున్న అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.