Apr 13,2023 14:30

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : రాజ్యాంగంలో హక్కులను మోడీ ప్రభుత్వం హరించడం అంబేద్కర్‌ స్మూర్తికి విరుద్ధమని సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యులు జక్కం శెట్టి సత్యనారాయణ అన్నారు. గురువారం సిపిఎం,సిపిఐ ఆధ్వర్యంలో రాజకీయ ప్రచార బేరి కార్యక్రమాన్ని కోమట్లపాలెంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి స్థానిక పెద్దలు పిట్ట బాబురావు, సిపిఎం మండల కార్యదర్శి పి.నరసింహమూర్తి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని రక్షించుకుందాం.. అంటూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార బేరి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మోయలేని భారాలను వేస్తూ కార్పొరేట్లకు వరాల కురిపిస్తున్నాడన్నారు ప్రజల సంపదని అంబానీకి, ఆదానికి కట్టబెట్టడానికి మోడీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. 75 సంవత్సరాల క్రితమే ఎందరో త్యాగధనులు స్ఫూర్తితో రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ప్రజాస్వామ్యం లౌకికత్వం సామాజిక న్యాయం వంటి విలువలను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే కార్యక్రమాలకి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు నరాల శెట్టి రామకృష్ణ, ఎం.పెంటారావు, ఎస్‌.సంజీవరావు, జి.శ్రీను, జి.రాఘవ, ఎం.సాదు పాల్గొన్నారు.