ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : సామాన్యులకు అందుబాటులో లేని ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వైసిపికే దక్కుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) అన్నారు.గురువారం స్థానిక ఇందిరమ్మ కాలనిలోని సచివాలయం వద్ద ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి నుండి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నెలకు రెండు రోజులు జరుగుతాయని చెప్పారు. ఉదయం సాధారణ కేసులు చూస్తారని మధ్యాహ్నం లేవలేని స్థితిలో ఉన్న రోగులకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందిస్తారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో 67 రకాల మందులు 14 రకాల రక్తపరీక్షలు ఉచితంగా చేస్తారని చెప్పారు. ఇకనుండి ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వైద్యం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి.సంతోష్ నాయుడు, పి.కిరణ్మయి, సిహెచ్‌ఓ జాలాది విల్సన్ బాబు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










