ఉంగుటూరు జగనన్న కాలనీలో ఘటన
ప్రజాశక్తి - ఉంగుటూరు (ఏలూరు జిల్లా):తాపీ పనిచేస్తూ విద్యుదాఘాతానికి గురై కార్మికుడు దుర్మరణంపాలైన ఘటన మండల కేంద్రం ఉంగుటూరు జగనన్న కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ప్రకారం... గ్రామానికి చెందిన షేక్ మహ్మద్(20) తాపీ పనులకు వెళ్లి కుటుంబానికి అండగా ఉంటున్నారు. పనిలో భాగంగా ఉంగుటూరు జగనన్న కాలనీలో ముఖద్వారం ఆర్చి నిర్మాణ పనులకు వెళ్లారు. ఆర్చి పైభాగంలో పిట్టగోడ, ప్లాస్టరింగ్ పనులు చేస్తుండగా ఆ కాలనీ మీదుగా వెళ్లిన 11 కెవి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మహ్మద్ కుటుంబానికి న్యాయం చేయాలని కాంట్రాక్టర్‌ని డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ తీగలను ఆర్చికి దూరంగా జరిపేందుకు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని, అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ఇంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ తీగలు మార్చేవరకూ పనులు చేపట్టద్దని నిర్మాణదారులను కోరామని తెలిపారు.










