ప్రజాశక్తి-ఏలూరు టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. లోకేష్ ఇప్పటి వరకు 2,710 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెంలో ప్రారంభమైన పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మరోవైపు కొయ్యలగూడెం వద్ద పార్టీ కార్యకర్తలు లోకేష్‌కు యాపిల్ గజమాలతో ఘన స్వాగతం పలికారు.

శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. యువగళంగా ప్రారంభమైన పాదయాత్ర.. ప్రజాగళంగా మారిందన్నారు. లోకేష్ అతని టీమ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.










