ప్రజాశక్తి-చిత్తూరు : విద్యుత్ శాఖ అదికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ఘాతానికి గురైన లైన్‌మ్యాన్ పవన్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. యాదమరి సచివాలయంలో లైన్ మేన్‌గా పని చేస్తున్న పవన్ స్థానికంగా మరమతుల నిమిత్తం ఎల్సీ అనుమతులు తీసుకొని, విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో కరెంటు అన్ చేయడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ పవన్‌ను హుటాహుటిన వేలూరు సియంసికి తరలించి చికిత్స అందిచారు. తమ తప్పిదంతో ప్రమాదం జరిగిందని, కాంపన్షేషన్‌గా వైద్య ఖర్చులు తామే భరిస్తామని పవన్ కుటుంబసభ్యులకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హామి ఇచ్చారు. సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్న పవన్‌ను సియంసి హాస్పిటల్ సిబ్బంది డిస్చార్జ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పవన్‌ను తిరుపతి రమాదేవి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పవన్ మతి చెందాడు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే పవన్ మృతిచెందాడని మృత దేహంతో కలెక్టరేట్ ఎదుట బంధువులు ధర్నాకు దిగారు.










