ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మహనీయులు చూపిన మార్గంలో పయనించి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర మేయర్ మహమ్మద్ వసీం పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగర మేయర్ మహమ్మద్ వసీం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి , డిప్యూటీ మేయర్ లు వాసంతి, విజయ భాస్కర్ రెడ్డి, కమిషనర్ భాగ్యలక్ష్మి లు హాజరైనారు పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ 77వ వేడుకలను పురస్కరించుకుని అజాదిక అమత్ మహౌత్సవ్ కార్యక్రమాన్ని తమ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో నగరాన్ని మరింత అభివృద్ధి సాధించి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సాధ్యమైందని అన్నారు. మహనీయుల ఆశయాలను అమలు పరచడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళులు అని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.










