Jul 15,2023 09:24
  • పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు
  • పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌, బిజెపిలపై ఆగ్రహం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జరిగిన హింస, రిగ్గింగ్‌, దాడులకు వ్యతిరేకంగా లెఫ్ట్‌ ఫ్రంట్‌, దాని మిత్రపక్షాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఎస్ల్పానేడ్‌లోని లెనిన్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ సెంట్రల్‌ కోల్‌కతాలోని ఎంటాలి మార్కెట్‌లో ముగిసింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిజెపి హింసాత్మక మోసపూరిత చర్యలపై లెఫ్ట్‌ఫ్రంట్‌, దాని మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మెన్‌ బిమన్‌ బోస్‌, సిపిఎం నాయకులు మహ్మద్‌ సలీం, సూర్యకాంత మిశ్రా, సుజన్‌ చక్రవర్తి, ఐఎస్‌ఎఫ్‌ ఎమ్మెల్యే నౌషాద్‌ సిద్ధిఖీ, కాంగ్రెస్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, సీపీఐ నాయకులు నిరసన ర్యాలీకి నాయకత్వం వహించారు. పాదయాత్రగా బయలుదేరారు.
           సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సలీం మాట్లాడుతూ... ''ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నకిలీ సర్టిఫికెట్లతో తొలి ఎన్నికల్లో పోరాడారు. దేశ ప్రధాని కూడా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అధికారంలోకి వచ్చారు. పంచాయతీ ఎన్నికలకు కూడా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం ద్వారా అధికారాన్ని తృణమూల్‌ చేజిక్కించుకుంటున్నది. కానీ బెంగాల్‌ ప్రజలు నకిలీ సర్టిఫికెట్లపై సృష్టించిన పంచాయతీని అంగీకరించరు'' అని తెలిపారు.
ఎన్నికల్లో బిజెపి వ్యవహారం పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఆరెస్సెస్‌.. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ద్వారా డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది. త్రిపుర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, అసోం, యూపీ సహా ఆరెస్సెస్‌ ద్వారా నడుస్తున్న రాష్ట్రాలకు ఆమె వెళ్తుంది. మళ్లీ బెంగాల్‌ విభజన జరగాలని యోచిస్తున్నారు. కూచ్‌ బెహార్‌ నుంచి ఉత్తర బెంగాల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని బిజెపి కోరుకుంటోంది.
             బెంగాల్‌ను మళ్లీ విభజించాలనే ఈ కుట్రకు వ్యతిరేకంగా బెంగాల్‌ ప్రజలు నిలబడతారు'' అని ఆయన అన్నారు. పలువురు లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు ఒకదాని తర్వాత మరొకటిగా కౌంటింగ్‌ కేంద్రాల్లో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌ఎఫ్‌ ఎమ్మెల్యే నౌషాద్‌ సిద్ధిఖీ తదితరులు ప్రసంగించారు. కాగా పంచాయతీ ఎన్నికల హింసలో మరణించిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన 49 మంది కార్యకర్తలు, సామాన్య ప్రజలకు లెఫ్ట్‌ ఫ్రంట్‌ నివాళులర్పించింది. కోల్‌కతాతో పాటు, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ నుంచి చాలా మంది ప్రజలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
 

                                                  వీధుల్లో దొరికిన సిపిఎం గుర్తుపై ఓటువేసిన బ్యాలెట్‌ పత్రాలు

పశ్చిమబెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్‌లో ఓ బ్లాక్‌లోని కౌంటింగ్‌ కేంద్రం దగ్గర పడి ఉన్న సిపిఐ(ఎం) ఓట్లను గుర్తించారు. తూర్పు బుర్ద్వాన్‌లోని ఈ బ్లాక్‌కు సంబంధించిన కౌంటింగ్‌పటులి కిషన్‌ మండిలో జరిగింది. ఓట్ల లెక్కింపు అనంతరం కిషన్‌ మండి గోడల పక్కన పడి ఉన్న బ్యాలెట్‌ పత్రాల దొంతరలను గుర్తించారు. బ్యాలెట్‌ పేపర్లలో సిపిఎం గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటరు ముద్రలను స్థానికులు గుర్తించారు. సీపీఐ(ఎం) స్థానిక నాయకులు మాట్లాడుతూ... ప్రతి బ్యాలెట్‌ పేపర్‌పైనా ప్రిసైడింగ్‌ అధికారి సంతకం ఉంటుంది. ఓటు వేసేటప్పుడు బ్యాలెట్‌ పేపర్‌పై సంతకం చేస్తారు. ఈ బ్యాలెట్‌ పత్రాలు కరిగర్‌ పారాలోని పూర్వస్థలి గ్రామ పంచాయతీలోని బూత్‌ నంబర్‌ 228కి చెందినవిగా వారు పేర్కొన్నారు. ఇక్కడనుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేసిన మరియా బిబి షేక్‌ కేవలం మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని సిపిఎం నాయకులు తెలిపారు.
           సిపిఎం, కాంగ్రెస్‌, ఐఎస్‌ఎఫ్‌లు నామినేషన్‌లు వేసిన నాటి నుంచే దోపిడీ ప్రక్రియ మొదలైందన్నారు. ఈ దోపిడీ ప్రక్రియలో తృణమూల్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పాలుపంచుకుందని వారు ఆరోపించారు. ప్రతిపక్షాల అభ్యర్థులకు అనుకూలమైన ఓట్లను బయటకు విసిరేశారని, అయినప్పటికీ ప్రతిపక్ష అభ్యర్థులు గెలిచిన చోట సర్టిఫికెట్‌ ఇవ్వలేదని అన్నారు. తణమూల్‌ డిమాండ్‌ మేరకు ప్రతిపక్ష ఏజెంట్లను బహిష్కరించి మళ్లీ కౌంటింగ్‌ చేపట్టారని, ఆ తర్వాత తృణమూల్‌ అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారని అన్నారు.
            సిపిఎం పూర్వస్థలి-2 ఏరియా కమిటీ సభ్యుల్లో ఒకరైన కార్తీక్‌ దాస్‌ మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు జరుగుతాయని మేం ముందే ఊహించాం. ఓట్ల లెక్కింపు రోజున బ్యాలెట్‌ బాక్సులను తీసుకురావడానికి తాత్కాలిక ఉద్యోగులను ఉపయోగించవద్దని పూర్వస్థలి-2 బిడిఒను కోరాం. అయినా... ఆయన మా విజ్ఞప్తిని అంగీకరించలేదని కార్తీక్‌ దాస్‌ తెలిపారు.