Apr 23,2023 13:07

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : రోడ్లు, భవనాల నిర్మాణాలకు ఉపయోగించే కంకర కొనుగోలులో ఇష్టానుసారంగా వసూలు చేస్తే ఖబడ్దార్‌ అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి క్రషర్‌ యజమానులను హెచ్చరించారు. ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ... నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొడుతుండటంతో ఈ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించిందన్నారు. ఈ ప్రైవేట్‌ ఏజెన్సీ వారు ప్రతి పైసాకు కచ్చితంగా రాయల్టీ వసూలు చేస్తుండడంతో కొందరు యజమానులు ధరలు పెంచేసి ఆ భారం ప్రజలపై వేస్తున్నారన్నారు. ఒక్క ట్రాక్టర్‌ కంకర ధర గతంలో రూ.2,000 ఇప్పుడు రూ.3,500 ఉందని, 20 ఎంఎం 3 యూనిట్ల టిప్పర్‌ ధర గతంలో రూ.6 వేలు ఉండగా ఇప్పుడు 9,300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు. దీన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని పరిధిలోని ప్రతి క్రషర్‌ యజమానులు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని ఇష్టానుసారంగా వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.