Jul 06,2023 16:03
  • నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
  •  మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ప్రజాశక్తి ఉరవకొండ (అనంతపురం) : రైతులపై కేసులు నమోదు చేసారంటూ పబ్లిసిటీ స్టంట్‌ కోసం పయ్యావుల కేశవ్‌ మొసలి కన్నీరు కారుస్తున్నాడని.. రైతుల ముసుగులో డ్రామాలు చేయడం కట్టిపెట్టాలని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హితవు పలికారు. గురువారం ఉరవకొండ వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. టీడీపీ నేతలపై పోలీసులు నమోదు చేసిన కేసులపై రైతులపై పేరిట ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ రాజకీయం చేయడంపై మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఫైర్‌ అయ్యారు. పయ్యావుల దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం అన్నారు. వైసిపి రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంత సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. రైతులకు ఏదైనా కష్టం కలిగితే దాన్ని పరిష్కరించేందుకు అందరికన్నా ముందుగా మేమే ఉంటామన్నారు. టీడీపీ నాయకులకు పయ్యావులకు కేశవ్‌కు వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత.. హక్కు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలతో రాష్ట్ర మొత్తం సంక్షోభంలో ఉండిపోయిన సమయంలో ఒక్క రైతు ఆత్మహత్యను కూడా చూడడానికి, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా వెళ్ళని పయ్యావుల కేశవ్‌ పబ్లిసిటీ కోసం ముసలి కన్నీరు కారుస్తున్నాడన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారని ఆయన తెలిపారు. గత ఏడాది అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 850 కోట్లకు పైగా ఇన్సూరెన్స్‌ రైతులకు అందించామన్నారు. సీజన్ల వారీగా ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్పుట్‌ సబ్సిడీని రైతులకు సకాలంలో అందించిన ఘనత ఒక్క వైయస్‌ జగన్‌ ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయానికి గిట్టుబాటు కల్పించడం కోసమే, ఎటువంటి కరువు కాటకాలు నష్టాలు జరగకుండా ప్రత్యేకంగా వ్యవసాయ మిషన్‌ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఇన్సూరెన్స్‌ ప్రీమియంతో సహా ప్రభుత్వమే చెల్లించి,ఇన్సూరెన్స్‌ కంపెనీని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్నారు. ఇన్పుట్‌ సబ్సిడీ గానీ ఇన్సూరెన్స్‌ గాని అన్ని పారదర్శకంగా చేస్తున్నామని సైంటిఫిక్‌గా నిర్ధారించిన తర్వాతే అమలు చేస్తున్నామని రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు కషి చేస్తున్నామన్నారు.అయితే వేరుశనగ రైతులకు కొంత నష్టం జరుగుతోందని కేంద్రం పరిధిలోని ఫసల్‌ బీమా పథకం లో కొంత లోపం ఉందని మూడు,ఐదు సంవత్సరాల సగటు ఆధారంగా పంట దిగుబడి నష్టాన్ని లెక్కించడం జరుగుతుందని దీనివల్ల కరువు ప్రాంతాల రైతులకు చాలా నష్టం జరుగుతుందని ఈ లోపాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశామని మరోసారి కోరుతామన్నారు.ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుందని టిడిపి జన్మభూమి కమిటీల ద్వారానో చెట్ల కింద కూర్చొని రాసుకునో నిర్ధారిస్తుండడం లేదని తాము ఏది చేసిన రైతు మంచి కోసమే చేస్తామన్నారు.మీ మాటలు వినో మీరు రెచ్చగొడితేనో రైతులు నమ్మే పరిస్థితిలో లేరని ఏది ఏమైనా రైతుల పట్ల తాము ఉదారంగా వ్యవహరిస్తామని నిజమైన రైతులపై నమోదు చేసిన కేసులు విషయంలో కూడా ఉదారంగ వ్యవహరించి వారికి ఈ కష్టం జరుగకుండా న్యాయం చేస్తామని విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు.