Oct 20,2022 15:44

ప్రజాశక్తి-వికోట (చిత్తూరు) : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం వీకోట పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌ సచివాలయం పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న నవరత్నాలు, ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. వాటితోపాటు వీధుల్లోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటీని సత్వరం పరిష్కారించాలని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా గడిచిన మూడు సంవత్సరాలుగా అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రతి గడపకు అందించారు. ప్రజల సౌకర్యం కోసం నూతనంగా నిర్మించిన అంబేద్కర్‌ నగర్‌ గ్రామ సచివాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ లక్షలాది రూపాయల లబ్ధి చేకూర్చారని కొనియాడారు. అన్ని రంగాల అభివృద్ధికి పెద్దపీట వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్‌ స్థానిక సర్పంచ్‌ పియన్‌ లక్ష్మీ, వైస్‌ ఎంపీపీ తమీంఖాన్‌, వైసిపి నేతలు పియన్‌ నాగరాజు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అమర్నాథ్‌, ఎంపీడీవో బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.