ప్రజాశక్తి-వి కోట(చిత్తూరు) : 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎంపీపీ యువరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ స్నేహ, సోదర భావంతో, స్వేచ్ఛగా జీవించాలని పిలుపునిచ్చారు. స్థానిక నారాయణ ఈ టెక్నో పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మార్వో చిట్టి బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మారుమూల ప్రాంతంలోని విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని వారు అభినందించారు. పట్టణంలో పాఠశాల ప్రిన్సిపాల్ గీత ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మేజర్ గ్రామపంచాయతీ వీకోట కార్యాలయం వద్ద సర్పంచ్ పిఎన్ లక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజు, ఉప సర్పంచ్ అక్మల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రముఖ కూడళ్ళలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి మిఠాయిలు పంచారు.










