ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని సిపిఎం పాలకొల్లు కార్యదర్శి జవ్వాది.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక విద్యుత్తు కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ట్రూ అప్ ఛార్జ్, సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపడం సరైంది కాదన్నారు. ఒక ప్రక్క ఛార్జీల మోత, మరోపక్క విద్యుత్ కోతలను ప్రజలు భరించలేక పోతున్నారన్నారు. విద్యుత్ సంస్కరణలు పేరుతో సబ్సిడీలు ఎగ్గొట్టి, స్మార్ట్ మీటర్ పెట్టి మరింత భారాన్ని మోపాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రజలు పెరుగుతున్న ధరల భారాలకు తోడు బిల్లులు వస్తున్న తీరు మరింత గాభరా పడుతున్నారని.. పెంచిన విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతరం కరంటు బిల్లులతో జనానికి షాక్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వలవల శ్రీరామామూర్తి, చల్లా సోమేశ్వరరావు, వై. అజరు కుమార్, తిరుమాని శ్రీనివాసరావు,టి. గంగరాజు, మల్లుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










