Mar 02,2023 14:57

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పోలీసు ఐల్యాండ్‌ వద్ద ధర్నా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ, మడకా రాజులు మాట్లాడతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన సమయంలో 400 రూపాయలున్న గ్యాస్‌ ధర నేడు 1200లకు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల ధరలు పెంచుతున్న, పన్నుల భారం మోపుతున్న, బిజెపి ప్రభుత్వానికి వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,14,847 గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా జిల్లాలో రోజుకు 21వేలు, నెలకు 6 లక్షలు సిలిండర్లును వినియోగదారులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అడ్డూఅదుపు లేకుండా వంటగ్యాస్‌ సిలిండర్‌ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం పడుతోందన్నారు. తాజాగా పెంచిన ధరతో జిల్లాలోని గ్యాస్‌ వినియోగదారులపై నెలకు అదనంగా మూడు కోట్లు భారం పడుతుందని తెలిపారు. కరోనా దెబ్బకు సామాన్య ప్రజల ఆదాయాలు పడిపోయాయని,ఎంతో మంది ఉపాధి కోల్పోయారని, అయినప్పటికీ ఏ మాత్రం కనకరంలేకుండా మోడీ సర్కార్‌ ప్రజలపై పెనుభారాలను మోపుతోందన్నారు. భవిష్యత్తులో వంట గ్యాస్‌ వదిలేసి కట్టెల పోయ్యి వినియోగిస్తే మంచిదనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోందన్నారు. ఈ ధర్నాలో జవ్వాది శ్రీను, అగుర్తుల రామోహనరావు, కాలపురెడ్డి కొండలరావు, రౌతు వెంకటనాగేంద్ర, పతివాడ నాగేంద్రబాబు, కన్నంరెడ్డి శివాజీ, కలిగట్ల వీర్రాజు, జవ్వాది శివ, నీరుకొండ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.