ప్రజాశక్తి-వీకోట(చిత్తూరుజిల్లా) : మండల పరిధిలోని కొంగాటం గ్రామపంచాయతీలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కొంగాటం చేరుకున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తోందని ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి రాగానే నాసిరకం బ్రాండ్లతో సామాన్యుల ప్రాణాలను బలిగొంటున్నరని ఆరోపించారు. కుప్పంలో చంద్రబాబు రాకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం ఈ ప్రభుత్వ దుష్ట పాలనకు నిదర్శనం అన్నారు.ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గరలో ఉందన్నారు. టిడిపి హయంలో చేపట్టిన అభివృద్ధి తప్ప గడచిన మూడున్నరెళ్ళలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజలతో మమేకమౌతూ పెరిగిన ధరలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ ముందుకు కదలారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏఎం రంగనాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయుడు, రాంబాబు నాయుడు, ఈశ్వర్ గౌడ్, సోము చంద్రరెడ్డి, విశ్వనాథ్ ధీరజ్, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.










