Apr 14,2023 15:08

కర్ణాటక: కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బిజెపిలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాది శుక్రవారం బెంగళూరులో రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. సిద్ధరామయ్య స్వగృహంలో ఈ భేటీ జరిగింది. మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికలకు బిజెపి తన తొలి అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజు, లక్ష్మణ్‌ సవాడి బుధవారం బిజెపి నుంచి వైదొలిగారు. దీంతో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ యడియూరప్ప తర్వాత కర్ణాటకలో బిజెపికి చెందిన అత్యంత సీనియర్‌ లింగాయత్‌ నాయకులలో సవాది ఒకరు. ఆయన కాంగ్రెస్‌ లో చేరి ఆపార్టీ టికెట్‌ పై బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లక్ష్మణ్‌ సవాడి కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై ప్రకారం ముందుకు సాగుతానని ఆయన ప్రకటించారు. తాను ఆత్మగౌరవ రాజకీయ నాయకుడిని చెప్పారు.కాగా, సవాడి 2018 ఎన్నికల్లో అథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మహేష్‌ కుమత్తహళ్లిపై ఓడిపోయారు. ఒక సంవత్సరం తరువాత, కాంగ్రెస్‌-జనతాదళ్‌ సెక్యులర్‌ ప్రభుత్వం నుండి సామూహిక ఫిరాయింపుల్లో ఆయన కీలకంగా వ్యవహారించారు. అందుకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఈ ఫిరాయింపుదారుల్లో ఒకరైన మహేష్‌ కుమఠహళ్లి ఈసారి అథని నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను బరిలో దిగాలని సవాది భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌నేత మాజీ ఎమ్మెల్సీ రఘు ఆచారి శుక్రవారం హెచ్‌డి దేవెగౌడ, మాజీ సిఎం హెచ్‌డి కుమారస్వామి సమక్షంలో జెడిఎస్‌ పార్టీలోకి చేరారు. మంగళవారంరోజు బిజెపి 189మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 2018లో జరిగిన అసెంబీ ఎన్నికల్లో బిజెపి 104 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్‌ 80, జెడిఎస్‌ 37 సీట్లను సొంతం చేసుకుంది. కర్ణాటకలో మే 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మే 24వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.