Jun 23,2022 06:41
  • మూడేళ్లలో ఇదే కనిష్టం
  • వేరుశనగ, పత్తి, మిర్చి సైతం
  • ప్రభుత్వ నాల్గవ ముందస్తు అంచనా వెల్లడి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : నిరుడు రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడులు గడచిన మూడేళ్లల్లోకెల్ల అతి తక్కువ లభించాయి. 2021-22 ఖరీఫ్‌, రబీ కలుపుకొని 160.01 లక్షల టన్నులొచ్చాయి. గతేడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి 166.60 లక్షల టన్నులు కాగా, ముందటేడు 180.54 లక్షల టన్నులు. మూడేళ్లల్లో ఆహార పంటల దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. ఈ కాలంలో వరి దిగుబడులు అంతకంతకూ తగ్గాయి. పప్పుధాన్యాల ఉత్పత్తి కొంతవరకు పర్వాలేదనిపించగా, నూనె గింజల్లో వేరుశనగ, వాణిజ్యపంటల్లో మిరప, పత్తి దిగుబడులు, ఉత్పాదకత బాగా దిగజారాయి. పంట ఉత్పత్తులపై తాజాగా అర్థగణాంక శాఖ నాల్గవ ముందస్తు అంచనాలు వెల్లడించింది. 2021-22లో ఖరీఫ్‌, రబీ కలుపుకొని ఆహార పంటలు 41.33 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. నిరుడు సాగు 43.05 లక్షల హెక్టార్లలో జరగ్గా, ముందటేడు 42.15 లక్షల హెక్టార్లు. తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, అక్కడక్కడ డ్రైస్పెల్స్‌ ఖరీఫ్‌ దిగుబడులను దెబ్బతీశాయి. ఆ ప్రభావం వరి ఉత్పత్తి, ఉత్పాదకతపై పడింది. దాంతోపాటు కాల్వల కింద, బోర్ల కింద రబీలో ప్రభుత్వం వరి సాగును నియంత్రించడంతో పుష్కలంగా భూగర్భజలాలు, నీటి వనరుల్లో నీరు ఉన్నా వరి సేద్యం మునుపటి సంవత్సరం కంటే లక్ష హెక్టార్లకుపైగా తగ్గింది. కిందటి ఖరీఫ్‌లో హెక్టారుకు వరి ఉత్పాదకత 4,930 కిలోలుగా అంచనా వేయగా, నాల్గవ ముందస్తు అంచనాల్లో 4,351 కిలోలకు తగ్గించారు. నిరుడు అంతకంటే తక్కువ 4,223 కిలోలొచ్చింది. ఈ ఏట రబీలో వరి ఉత్పాదకత ఆశాజనకంగా ఉంది.
వేరుశనగ, పత్తి అంతే
వేరుశనగ ఉత్పత్తి, ఉత్పాదకత బాగా పడిపోయింది. 8.23 లక్షల హెక్టార్లలో సాగుకాగా 5.19 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఉత్పాదకత 631 కిలోలు. నిరుడు 8.70 లక్షల హెక్టార్లలో సాగు కాగా 7.78 లక్షల టన్నుల ఉత్పత్తి లభించింది. ఉత్పాదకత 894 కిలోలు. ముందటేడు 6.61 లక్షల హెక్టార్లలో సాగు కాగా 8.47 లక్షల టన్నుల దిగుబడి లభించింది. అప్పుడు ఉత్పాదకత 1,281 కిలోలు. వాణిజ్య పంటల్లో ప్రధానమైన పత్తి పరిస్థితి నిరాశా జనకంగా ఉంది. 2021-22లో 5.54 లక్షల హెక్టార్లలో సాగు కాగా 12.27 లక్షల బేళ్ల దిగుబ డొచ్చింది. ఉత్పాదకత 392 కిలోలు. మూడేళ్లల్లో ఇదే అతి తక్కువ. నిరుడు 6.60 లక్షల హెక్టార్లలో సాగు కాగా 16.04 లక్షల బేళ్ల దిగుబడి వచ్చింది. ఉత్పాద కత 449 కిలోలు. ముందటేడు 6.58 లక్షల హెక్టార్ల లో పత్తి సాగు కాగా 25.12 లక్షల బేళ్ల దిగుబ డొచ్చింది. అప్పుడు ఉత్పాదకత 649 కిలోలు.
మిరప మరీ దారుణం
మిరప 2021-22లో అత్యధికంగా 2.25 లక్షల హెక్టార్లలో సాగు కాగా 4.07 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఉత్పాదకత 1,809 కిలోలు. మూడేళ్లలో ఇదే అతి తక్కువ ఉత్పాదకత. నిరుడు 1.77 లక్షల హెక్టార్లలో మిర్చి సాగు కాగా 8.12 లక్షల టన్నుల దిగుబడొచ్చింది. ఉత్పాదకత 4,588 కిలోలు. ముందటేడు 1.53 లక్షల హెక్టార్లలో సాగు కాగా 7.83 లక్షల టన్నుల ఉత్పత్తి లభించింది. అప్పుడు ఉత్పాదకత 5,118 కిలోలు.

table