Jul 17,2023 22:07
  • సమస్యలు పరిష్కరించాలని కళాకారుల వినూత్న ఆందోళన

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ : కాళ్లకు గజ్జలు, చేతిలో డప్పులు, కోలాట కర్రలు, చెక్క భజన చెక్కలు, పిల్లన గ్రోవులతో పల్లెల నుండి జానపద కళాకారులు చిత్తూరు కలెక్టరేట్‌కు సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ కళా రూపాలను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో అక్కడ చేపట్టిన ఆందోళనతో పరిసరాలు హోరెత్తాయి. ప్రభుత్వం తమకు గుర్తింపు కార్డు, పింఛను మంజురు చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి), కాణిపాకం, శ్రీకాళహస్తి, ఇతర దేవాలయాల్లో నిర్వహించే బ్రహోత్సవాల్లో తమ కళలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించాలని, జానపద కళలను బతికించాలని నినాదాలు చేశారు. జానపద వృత్తి కళాకారుల సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం తమ సమస్యలపై జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వీరిలో చెక్క భజనలు, పండరి భజనలు, కులుకు భజనలు, కోలాటం, పిల్లన గ్రోవి సంప్రదాయ గ్రామీణ నృత్యాలు, పాటలతో సంప్రదాయ జానపదానికి జీవం పోస్తున్న కళాకారులు ఉన్నారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకీ జానపద కళలు కనుమరుగవుతున్నాయని తెలిపారు. వాటిని కాపాడాల్సిన పాలకులు, అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. సంఘం ఆధ్వర్యంలో గతంలో చేసిన అనేక పోరాటాల ఫలితంగా గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. స్థానికంగా ఉన్న ఆలయాల్లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించి కళాకారులను ఆదుకోవాలని, కళాకారులకు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కళాకారుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో టిటిడి ప్రతిష్టను పెంచుతున్న జానపద వృత్తి కళాకారుల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో గతంలో 50 రకాల కళలు ఉండేవని, కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నేడు 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. జానపద నృత్య కళాకారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సురేంద్రన్‌, అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్ర, రవికుమార్‌, వందలాది మంది జానపద కళాకారులు పాల్గొన్నారు.

2

 

3

 

4