Jul 18,2023 17:02

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : ప్రతి మహిళకు ఆర్థిక మేధస్సు ముఖ్యమని, ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే చదువు ద్వారా మంచి ఉద్యోగంలో స్థిర పడాలని తెలంగాణ ఇన్‌కం టాక్స్‌ కమీషనర్‌ సునీతారావు చెప్పారు. పాలకొల్లు డిఎన్‌ఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల 41వ వార్షికోత్సవంలో మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో మహిళలు చదువుకొనేందుకు అవకాశాలు ఉండేవికాదని ఇపుడు అవకాశాలతో పాటు పోటీ పెరిగిందని చెప్పారు. సెల్‌, ఫేస్‌ బుక్‌లు దూరంగా పెట్టి, నిర్దిష్ట లక్ష్యంతో చదివితే ఆర్థిక పుష్టి వస్తుందని చెప్పారు. డిగ్రీ 3 సంవత్సరాలలో కష్టపడి చదివితే తరువాత 60 సంవత్సరాలు సుఖంగా ఉండవచ్చు అన్నారు. ఉన్నత స్థానాలకు వెళితే మీరు చదివిన కళాశాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మీ లక్ష్యం ఉన్నతంగా ఉండి కలలు కంటే సరిపోదని, రోజు పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.శోభారాణి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం నాక్‌ గుర్తింపు కోసం కళాశాలలో పటణ ప్రముఖుల సహాయంతో అన్ని వసతులు సమకూర్చామన్నారు. విద్యార్ధినులు చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉన్నవారే కరోనా తట్టుకుని బ్రతికారని సిపిడిసి సభ్యులు అడబాల వెంకటరమణ చెప్పారు. ఇంకా గత ఏడాది వివిధ పోటీల్లో ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంకా సిపిడిసి సభ్యులు కొమ్ముల మురళి, చోడిశెట్టి బారిస్టర్‌, శేషగిరిరావు, మైథిలి, నాగలక్ష్మి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రవిశంకర్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇంకా ప్రిన్సిపాల్‌ డా శోభారాణి పాల్గొన్నారు.