Jun 28,2023 10:38

నాసిక్‌ : గో గూండాల దాడిలో చనిపోయిన అఫాన్‌ అబ్దుల్‌ అన్సారీ మృతదేహాన్ని చూసినవారి హృదయం ద్రవిస్తోంది. ఆయనను చిత్రహింసలు పెట్టి చంపారని అర్థమైపోతోంది. దాడిలో అన్సారీ ముక్కు పగిలిపోయింది. నుదుటిపై పెద్ద గాయం కన్పిస్తోంది. ఆయన చేతి వేళ్లు వెనక్కి మెలితిప్పి ఉన్నాయి. చేతిపై కూడా గాయాలు ఉన్నాయి. చెవులపై ఏదో ఒక ఆయుధంతో కొట్టినట్లు కన్పించింది. మొత్తంమీద ఆయన శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. అయితే పోస్ట్‌మార్టం నివేదిక మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పొత్తికడుపు పైన, తల పైన అయిన గాయాల కారణంగా అధిక రక్తస్రావం జరిగి చనిపోయాడని ఆ నివేదికలో తెలిపారు.
        ముంబయికి చెందిన 32 సంవత్సరాల అన్సారీ ఇద్దరు ఆడపిల్లల తండ్రి. మహారాష్ట్రలోని నాసిక్‌లో కారులో మాంసాన్ని రవాణా చేస్తుండగా గో గూండాలు అతనిపై దాడి చేసి చంపారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న స్నేహితుడు నాసిర్‌ ఖురేషీపై కూడా దాడి జరిగింది. అతను ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే చట్ట విరుద్ధంగా జంతువును చంపారన్న అభియోగంపై అన్సారీ, ఖురేషీలపై పోలీసులు కేసు పెట్టారు. అది ఏ జంతువో తెలుసుకునేందుకు మాంసాన్ని ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపారు. మహారాష్ట్రలో ఆవులతో పాటు ఎడ్లను చంపడంపై కూడా నిషేధం అమలులో ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు గో గూండాలు తమపై దాడి చేసేలా ప్రోత్సహిస్తున్నాయని మాంసం వ్యాపారులు, రవాణాదారులు అంటున్నారు. మాంసాన్ని ముక్కలుగా చేసిన తర్వాత అది ఏ జంతువుదో తెలుసుకోవడం కష్టమని వారు చెప్పారు. నాసిక్‌ ప్రాంతంలో గత పదిహేను రోజులలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. ఇలాంటి దాడులు జరిగినప్పుడు తమను ఎవరూ కాపాడడం లేదని రవాణా సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఆసియాలోనే అతిపెద్ద పశు వధశాలకు చెందిన షాహిద్‌ షేక్‌ వాపోయారు. మాంసాన్ని రవాణా చేయాలంటే డ్రైవర్లు భయపడుతున్నారని ఆయన అన్నారు.
 

                                                                  మెరుగైన ఆదాయం కోసం వచ్చి...

అన్సారీ విషయానికి వస్తే నాలుగు నెలల క్రితం వరకూ ఆయన ముంబయిలో ఎయిర్‌ కండిషనర్లను మరమ్మతు చేస్తుండేవాడు. ఆ తర్వాత మెరుగైన ఆదాయం కోసం మాంసం రవాణా చేయడం ప్రారంభించాడు. సంఘటన జరిగిన 24వ తేదీన అతనికి ఓ ఆర్డర్‌ వచ్చింది. అహ్మద్‌నగర్‌ జిల్లాలోని సంగమ్‌నేర్‌ నగరం నుండి ముంబయికి మాంసాన్ని రవాణా చేయాలని అడిగారు. ఇందుకు అంగీకరించిన అన్సారీ తన స్నేహితుడైన ఖురేషీని వెంట తీసుకొని వెళ్లాడు. కారు టోల్‌ప్లాజా వద్దకు రాగానే కొందరు వ్యక్తులు అటకాయించారు. భయంతో కారును వేగంగా నడుపుతుండగా కార్లు, మోటారు సైకిళ్ల మీద వెంటపడ్డారు. చివరికి వారిద్దరినీ కారు నుండి కిందికి లాగి మరో కారులో ఎక్కించుకొని సమీపంలోని అడవిలోకి తీసికెళ్లారు. అక్కడ వారిని చెట్టుకు కట్టేసి రెండున్నర గంటల పాటు తీవ్రంగా హింసించారు. ఈ దారుణ ఘటనలో అన్సారీ చెంపల ఎముకలు బాగా నలిగిపోయాయి. బూట్లతో అనేక సార్లు అన్సారీ ముఖంపై కొట్టినట్లు అతని శవాన్ని చూసిన వారికి అర్థమవుతోంది. చిత్రహింసల అనంతరం వారిద్దరినీ తాళ్లతో కట్టేసి కారులో వదిలేశారు. ఆ తర్వాత అన్సారీ కుటుంబసభ్యులకు విషయం తెలిసి అక్కడికి వచ్చేసరికే అతను చనిపోయాడు.