ప్రజాశక్తి-వికోట (చిత్తూరు) : రైతుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని శివుని కుప్పం సమీపంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మామిడి కాయల మండీల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండీలను త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రైతులు వ్యాపారులకు సౌకర్యవంతంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ.. మామిడికాయల రైతులు సుదీర్ఘ కాలంగా పడుతున్న అవస్థలను, వారి సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఈ నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, మాజీ రెస్కో చైర్మన్ ఆర్ హెచ్ జయరాం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎమ్మార్ ఆంజనేయులు, జిల్లా పరిషత్ సలహా మండలి సభ్యులు గౌస్, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










