ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలని ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి బాబూరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మంగళవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో బంగారు గూడెం, వీరంపాలెం, పట్టింపాలెం, గ్రామాల్లో పర్యటించి ధాన్యం రాశులను, మొక్కజొన్న రాశులను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అంద వచ్చేసరికి అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతూ, తడిసి మొక్కలు వచ్చిన ధాన్యాన్ని నాయకులు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, తేమ శాతం అంటూ నిబంధనలు పక్కనపెట్టి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎకరాకు రూ.20 వేల పరిహారంగా ఇవ్వాలని ఆయన కోరారు. బంగారు గూడెం, వీరంపాలెం,పట్టే పాలెం గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులకు క్వింటాలకు 2500 రూపాయలు ధర ఇచ్చి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం తాడేపల్లిగూడెం మండల కార్యదర్శి పాల్పూరి సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను రైతులను ఏకం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తల్లి బోయిన శ్రీను బంగారు గూడెం, జాస్తి వెంకటరావు వీరంపాలెం, సత్యనారాయణ ,మేక సీతయ్య పట్టిం పాలెం, కాశగాని సూర్యచంద్రరావు, ముప్పిడి సీతారామరెడ్డి, సుంకర వెంకటరావు, జాస్తి శివరామకష్ణ, అచ్యుత రామారావు, తదితర రైతులు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు బంగారు గూడెం, వీరంపాలెం భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు పూరెల్ల కృష్ణ, సకినాల అచ్చయ్య, పెనుగొండ శ్రీనివాసు మంగరాజు సంఘీభావం తెలిపారు.










