ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చర్యలను ఫ్యాప్టో తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చర్యలను వ్యతిరేకంగా ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పాలకొల్లు లోని ప్రాధమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు మంగళవారం నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలుపుతూ విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షులు కె.రాజశేఖర్ మాట్లాడుతూ.. పాఠ్య పుస్తకాలు సకాలంలో ఇవ్వకపోవడం, ఇచ్చిన పుస్తకాలు కూడా విడతల వారీగా డిసెంబర్ వరకు ఇవ్వడం, కొన్ని పుస్తకాలు విద్యా సంత్సరం పూర్తి కావస్తున్నా ఇంకా ఇవ్వక పోవడం దారుణమాన్నారు. పిల్లలకు ఇచ్చిన బూట్లు కొలతలకు సరిపడా ఇవ్వకపోవడం, నాణ్యత లేని బ్యాగ్ ఇవ్వడం, నాడు - నేడు పనులలో లోపాలకు టీచర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అక్రమంగా సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను, అధికారులు సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో పిలుపులో భాగంగా బుధవారం సాయంత్రం పాత తాలూకా కేంద్రాలలో జరిగే నిరసన కార్యక్రమంలో మొత్తం ఉపాధ్యాయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కె రాజశేఖర్, యు టి ఎఫ్ జిల్లా సహా అధ్యక్షులు పాల్గొన్నారు.










