ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : ప్రజలకు వాతలు పెట్టి, కార్పొరేట్లకు దోచిపెట్టి, రాష్ట్రానికి, జిల్లాకు తీరని అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనములో పుట్టా వేణుగోపాల చౌదరి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజావ్యతిరేక బడ్జెట్ అని, మోసపూరిత బడ్జెట్ అని ఆయన విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెడితే ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశించారని ఆయన అన్నారు. అయితే మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన ద్వారా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదని, పోలవరం ప్రాజెక్టు కు నిధులు కేటాయించలేదని,కడప ఉక్కు ఫ్యాక్టరీ సంగతి మరిచారని,విశాఖపట్నం రైల్వేజోన్ ఇవ్వలేదని, వెనకబడిన ప్రాంతాలకు నిధుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ హామీ పక్కన పెట్టారని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధులు కూడా లేవన్నారు. మోడీ బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు రాయితీలిచ్చేలా, పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపేలా ఉందన్నారు.రైతాంగం పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం,వ్యవసాయ సబ్సిడీలు తగ్గించడం అన్యాయమన్నారు. జిల్లా నుండి ఆక్వా ద్వారా వేలు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల సేవ మాని ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మడకా రాజు, చిటికిన రాము, జవ్వాది శ్రీను, ధనాల వెంకట్రావు, అల్లం పూర్ణిమ, గొల్లు లక్ష్మీ, వర్రిఅప్పారావు, సిద్దిరెడ్డి శేషుబాబు, ధనాల దానయ్య, పోతు శ్రీను అయినల ధర్మారావు, అగుర్తుల రామోహనరావు, అయినాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










