Aug 31,2022 11:51

ప్రజాశక్తి వెదురుకుప్పం (చిత్తూరు) : వినాయక పండుగ రోజున గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉన్న రోడ్డును బాగు చేశారు. దీంతో తెలిసినవారు ఆ యువతకు బుధవారం అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు... చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, మాంబేడు హరిజనవాడకు చెందిన యువత రోడ్డు బాగు చేసేటందుకు నడుంబిగించారు. మాంబేడు గ్రామం నుంచి మాంబేడు ఏడబ్ల్యు, భారతీపురం, వేణుగోపాలపురం, (సింగపూర్‌ ఇండ్లు) కసుమనూరు కలుపుతూ తారు రోడ్డు నిర్మాణ పనులు గతంలో చేపట్టారు. ఈ దారి అటు పుత్తూరుకు, ఇటు పక్క రాష్ట్రమైన తమిళనాడుకు వెళుతుంది. మాంబేడు గ్రామం సమీపంలో బంతల గంగమ్మ దగ్గర రోడ్డు వర్షాలకు దెబ్బతిని సుమారుగా 20 అడుగుల మేర గచ్చు తేలింది. దీంతో ప్రయాణికులు రాకపోకలు ఇబ్బందిగా ఉండేది. ప్రయాణీకుల బాధను తొలగించాలని పెద్దల సహకారంతో మాంబేడు హరిజనవాడకు చెందిన యువత నడుంబిగించారు. సొంత ఖర్చులతో సిమెంటు, కావలసిన సామాగ్రిని తెచ్చుకుని కలవ కలిపి రోడ్డును బాగు చేశారు. తెలిసినవారు సర్వత్రా యువతకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ రోడ్డును బాగు చేయడం వలన రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉందని ప్రయాణికులు అంటున్నారు. గతంలో ఎక్కడ ద్విచక్ర వాహనదారులకు, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా బాగు చేయడం అభినందనీయమని గ్రామస్తులు అంటున్నారు.