ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గత 15రోజులుగా ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తూ పలు కారణాలతో షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, మరోవైపు సస్పెండ్ చేయడాన్ని చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చినబాబు వ్యతిరేకించారు. సోమవారం విలేకరుల సమావేశంలో చినబాబు మాట్లాడుతూ .. ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఉపాధ్యాయులను అకారణంగా సస్పెండ్ చేయడం ఆపాలని కోరారు. జి ఓ 117 రద్దు చేయకుండా 3, 4, 5 తరగతుల విలీనం పై ప్రజలలో వస్తున్న విమర్శలను పక్క దారి పట్టించేందుకు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ అస్త్రం ప్రయోగించారని ఆరోపించారు. నిరంతరం ఏదో ఒక కారణం చూపి సస్పెన్షన్ పరంపర కొనసాగడంతో ఉపాధ్యాయులు మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన డివైసులు లేవని డివైసర్లు ఉన్నా నెట్ సౌకర్యం కల్పించకుండా జేవీకే వస్తువులు పంపిణీ చేసినట్లు తల్లిదండ్రులు వేలిముద్రలు తీసుకోవాలని ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. అనేక యాప్ లు అప్లోడ్ కు సర్వర్ లు పని చేయడం లేదని, గ్రామీణ ప్రాంతాలలో సెల్ ఫోన్స్ సిగల్స్ ఉండవని తెలిపారు. ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గించాల్సిందిపోయి రోజుకో యాప్ దర్శనమిస్తూ, యమపాశంలా నాడు- నేడు, ఎండీఎం ఉన్నాయన్నారు. సకాలంలో విద్యార్థుల హాజరు అప్ లోడ్ చేయలేదని షోకాజ్ నోటీసులు జారీ చేయడం, సస్పెన్షన్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిఓ నెంబరు 84 (తేదీ 24-06-2022) ద్వారా 14 వేలమంది మునిసిపల్ ఉపాధ్యాయులను విద్యా శాఖలో విలీనం చేసి సరైన సర్వీసు రూల్స్ రూపొందించకుండా వారి ప్రయోజనాలను తుంగలో తొక్కి చేతులు దులుపుకున్నారని అన్నారు. నెల దాటినా డ్రాయింగ్ ( డిడిఓ) పవర్స్ ఎవరికో తెలియక జూలై నెల జీతం వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో దాదాపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు పత్రికా ముఖంగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విలీన ప్రక్రియ ఆపేయాలని వినతి పత్రాలు విద్యాశాఖ మంత్రికి ఇచ్చినప్పటికీ లాభం లేకుండా పోయిందని అన్నారు. కేవలం కేంద్రం నుండి నిధులను రాబట్టుకోవడానికి ప్రజల వ్యతిరేకత ఉన్న ఏకపక్షంగా జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపి ) అమలుపై ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రభుత్వం ఉపాధ్యాయులపై పగపట్టి పలు ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరపున చినబాబు ఖండించారు.










