ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని కేశేపల్లి గ్రామపంచాయతీ కురగానిపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మంగళవారం ఆశా వర్కర్ రామాంజనమ్మ పనులు జరిగే చోటకు వెళ్లి ఉపాధి కూలీలకు పంపిణీ చేశారు. ఎండలో పనుల వల్ల ఉపాధి కూలీలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర వాటి గురించి వివరించారు.
ఉపాధి హామీ పనుల వద్ద కానరాని టెంట్లు
ఉపాధి పనులు చేయాలంటే గ్రామాలకు దూర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు, వంకలకు చేరుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం నమోదు కావాలంటే కూలీలు రెండు పూటలా పనులు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరి పని ప్రదేశాలను వెళ్లడానికి కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. తీరా అంత దూరం నడిచాక, ఎండలో అక్కడ నిలువ నీడ లేకపోవడంతో కూలీలు వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కనీసం తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇటీవల కాలంలో ఉపాధి కూలీల వడదెబ్బ మరణాలు అధికమయ్యాయని గతంలో కేసేపల్లి గ్రామంలో మహిళా ఉపాధి కూలీ ఉపాధి పనికి చేస్తూ వడదెబ్బకు గురై మరణించడం జరిగింది అని పలువురు ఉపాధి కూలీలు అంటున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధి కూలీలా ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు..










