
- వామపక్షాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయం
- అదానీ కంపెనీ మేలు కోసమే విద్యుత్ ఛార్జీల పెంపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విద్యుత్ ఛార్జీల పెంపుదలను, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వామపక్షాల ఆధ్యర్యంలో ధర్నా నిర్వహించాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా గురువారం ఉదయం వామపక్ష పార్టీల ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, నాయకులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, వనజ, సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ నుంచి కె పొలారి, రామకృష్ణ, లిబరేషన్ నాయకులు హరినాథ్, ఎంసిపిఐయు నుంచి ఖాదర్ బాషా, ఎస్‌యుసిఐ నాయకులు సుధీర్, సిఐటియు నాయకులు ఎంఎ గఫూర్, ఎఐటియుసి నాయకులు సాంబశివరావుతోపాటు విద్యార్థి, యువజన, రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలపై సిహెచ్ బాబూరావు, నిర్బంధాలపై ముప్పాళ్ల నాగేశ్వరరావు పెట్టిన తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. ప్రభుత్వం విధిస్తున్న కోతలతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభకోణమని, బిగించడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ ఎనర్జీ పేరుతో భూములు లాగేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. వారిని భూమిలేని వారిని చేస్తున్నారని, ఇటువంటి చర్యలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. సోలార్ ఎనర్జీలో ఎకరాకు రూ.ఎనిమిది లక్షలు వస్తుందని, రైతుకు మాత్రం రూ.30 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ ఫెయిల్యూరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. పాదయాత్రలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు ఛార్జీలు పెంచారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్‌మీటర్లు పెట్టబోమని కేంద్ర ప్రభుత్వానికి తెగేసి చెబితే జగన్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మోడీ చెప్పినట్లు చెస్తున్నారని అన్నారు. చండీగఢ్ ప్రభుత్వం ఒక్కో స్మార్ట్ మీటర్ రూ.7,500 కొంటే జగన్ ప్రభుత్వం మాత్రం ఒక్కొక్కటీ రూ.32 వేలకు కొనుగోలు చేసిందన్నారు. ఎపి రైతు సంఘాల సమన్వమ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను రైతు సంఘాలు పోరాడి తిప్పి కొట్టాయని అన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌పై రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రం చట్టాలు చేస్తోందని, ఇది న్యాయసమ్మతం కాదని తెలిపారు. అదానీ కంపెనీ సంపదలను పెంచేందుకే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే విద్యుత్ సంస్కరణల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకులు పొలారి మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తోందని తెలిపారు. పోరాటాల ద్వారానే వాటిని తిప్పికొట్టాలని అన్నారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ.. ప్రత్యక్ష పోరాటాల ద్వారానే ప్రభుత్వాన్ని తిప్పికొట్టచ్చని పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా, కేవలం వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ఎంసిపిఐయు నాయకులు ఖాదర్‌బాషా మాట్లాడుతూ.. పాదయాత్రలో ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు నెలకోసారి పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. ఎస్‌యుసిఐ నాయకులు సుధీర్ మాట్లాడుతూ.. ప్రజలపై పడుతున్న భారాలను తిప్పికొట్టేలా వారిని చైతన్యం చేయాలని అన్నారు. సిఐటియు నాయకులు, మాజీ ఎమ్యెల్యే ఎంఎ గఫూర్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో ఉద్యమాలు చేసుకునే స్వేచ్ఛ కూడా లేదన్నారు. ప్రభుత్వ విధానాల గురించి ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఎఐటియుసి నాయకులు సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో జీవనం కష్టమవుతోందని తెలిపారు. నిత్యాసవరమైన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. దళితులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని అన్నారు. వారికి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని కోరారు. 75 యూనిట్లు దాటితే మొత్తానికి బిల్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు శంకర్, కోటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రసన్న కుమార్, ఐఎఫ్‌టియు నాయకులు రవిచంద్ర, రమణ, పిడిఎస్‌యు నాయకులు రాజేష్, స్కీమ్ వర్కర్ల సంఘం నాయకులు కమల మాట్లాడారు.
- విద్యుత్ భారాలు తగ్గించాల్సిందే
విద్యుత్ ట్రూ అప్, సద్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, ఈ విధానాన్ని ఉపసంహరించాలని, విద్యుత్ సుంకం రద్దు చేయాలని, వడ్డీ భారాన్ని వినియోగదారులపై వేసే ప్రతిపాదనలను నియంత్రణ మండలి తిరస్కరించాలని కోరుతూ పెట్టిన తీర్మానాన్ని రౌండ్‌టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు, నివాస గృహాలకు ఇతర వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు పెట్టే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని కోరింది. కేంద్ర విద్యుత్ చట్ట సవరణలు ప్రతిపాదనలు విరమించాలని, విద్యుత్ ప్రైవేటీకరణను విడనాడాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. 200 యూనిట్ల వినియోగించే పేద గృహ వినియోగదారులందరికీ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని, ఎక్కడ నివసిస్తున్నా ఎస్‌సి, ఎస్‌టి, చేతి వృత్తిదారులకు ఇస్తున్న రాయితీలను కొనసాగించాలని కోరింది.
- నిర్బంధాలు సరికావు
శాసనసభ సమావేశాల సరదర్భంగా విజయవాడ నగరంలో ప్రజా సంఘాలు తమ సమస్యలపై ఆందోళనలు, ప్రదర్శనలు, ధర్నాలు, శాంతియుత నిరసనలు తెలుపుతామంటే ప్రభుత్వం అంగీకరించడం లేదని, ఇటువంటి చర్యలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి రౌండ్‌టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారని, వేలాది మందిని హౌస్ అరెస్టులు చేస్తున్నారని, మహిళలను కూడా అనుమతించడం లేదని పేర్కొంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు భారత రాజ్యాంగం ప్రజలకు హక్కు ఇచ్చిందని తెలిపింది. స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని పేర్కొంది. పోలీసులు ప్రజల ప్రాథమిక హక్కులపై చేస్తున్న దాడిగా దీన్ని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ విధానాలను మార్చుకోవాలని కోరింది.