ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : ఉపాధి హామీ సమస్యలపై ఈ నెల 28న కలెక్టర్ ఆఫీసుల వద్ద జరిగే ధర్నా ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఉపాధి పర్యటనలో భాగంగా ... బుధవారం తాడేపల్లిగూడెం మండలం లింగారెడ్డిగూడెంలో ఉపాధి పని ప్రదేశంలో పర్యటించి కూలీలను ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని, 2019, 20 లో లక్షా పన్నెండు వేల కోట్ల రూపాయలుంటే 2023-24 లో రూ.60 వేల కోట్లకు కుదించి వేయడం దారుణమన్నారు. ఒక పక్క నిధులు తగ్గించి వేతనం 15 రూపాయలు పెంచటం హాస్యస్పదంగా ఉందన్నారు. ఉపాధి హామీ పనికి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, రెండు వందల రోజులు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన చేస్తుంటే ... అంతకంతకు నిధులు తగ్గించడం ఉపాధి కూలీల ఉసురు తీయడమేనన్నారు. ఉపాధి హామీకి రెండు లక్షల 40 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని, తదితర డిమాండ్లతో ఉపాధి హామీ సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న కలెక్టర్ ఆఫీసుల దగ్గర జరుగుతున్న ధర్నాలకు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, వ్యవసాయం కార్మిక సంఘం మండల కార్యదర్శి కండెల్లి రమేష్ బాబు, తదితరులు మాట్లాడారు.










