ప్రజాశక్తి-హిందూపురం(అనంతపురం) : విజయవాడలో ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయం వద్ద ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలని కోరుతూ ధర్నా చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అక్రమ అరెస్టునలు నిరసిస్తూ హిందూపురంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ.. విజయవాడలో ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయం వద్ద ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని ప్రయత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎక్కడకక్కడ ముందస్తు అరెస్టులు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు ద్వారా ఈ పోరాటాన్ని ఆపలేరన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చలర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్, నిహాల్, లిఖిత్, రాజు, వీరేష్, బాబా, రంగనాథ్ బాలాజీ, నాగరాజు, గగన్, శ్రీధర్, చిదానంద, కేశవ పాల్గొన్నారు.










