ప్రజాశక్తి-వికోట (చిత్తూరు) : రాష్ట్రంలోని పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప తెలిపారు. మండల పరిధిలోని కొంగాటం పంచాయతీపై గల కుప్పం గ్రామ సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ గడప వద్దకే మీ ఎమ్మెల్యే పర్యటన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకటేగౌడతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. పడిగల కుప్పం సచివాలయంకు సంబంధించిన ఎగువ గందార్ మాకులపల్లి, దిగువ గందార్ మాకులపల్లి, వీరాపురం, పడిగలకుప్పం, జేబి కొత్తూరు, విజయనగరం తదితర గ్రామాల్లో ప్రతి గడపను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలు సక్రంగా అందుతున్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమకు ప్రభుత్వ గృహాలు కావాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఎన్నికల సమయంలో గందారుమాకులపల్లి ,జేబీ కొత్తూరు గ్రామాలకు ప్రధాన రహదారి నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు వాటిని పూర్తి చేసినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్ , స్థానిక సర్పంచ్ అనిత జయరాం రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాల గురునాథ్, వైస్ ఎంపీపీలు తమీంఖాన్, లక్ష్మణ్ రెడ్డి, రెస్కో మాజీ చైర్మన్ ఆర్ హెచ్ జయరాం రెడ్డి, ఎంపీటీసీ కమలనాభంతో పాటు పలువురు సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










