Apr 18,2023 21:42
  •  పైలెట్‌ ప్రాజెక్టుగా 3 జిల్లాలు
  •  రూ.500 కోట్ల విలువైన భూములు స్వాధీనం
  •  డిప్యూటీ సిఎం కె సత్యనారాయణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :  రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు చెందిన భూములను ఆన్‌లైన్‌ చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని, ఆన్‌లైన్‌ చేయడం ద్వారా భూ వివాదాలకు చెక్‌ పెడతామని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులకు జారీ చేశామన్నారు. ఆన్‌లైన్‌ చేసేందుకు ముందుగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఒక్కొక్క జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. దేవాదాయశాఖ కమిషనర్లు, 26 జిల్లాల అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం విజయవాడ దుర్గమ్మతల్లి ఆలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, వివాదాస్పద ఆలయ భూముల వివరాలు, వెరిఫై అంశం, ప్రాథమిక ఆధారాలు, వివాదంలో ఉన్న భూములు, 22 ఎ1సి కింద రిజిస్టర్‌ అయిన భూములు, సర్వే నెంబరుకు సంబంధించిన సబ్‌ డివిజన్లు, దేవాదాయ, రెవెన్యూశాఖల ఆధీనంలోని భూములు, వివాదాలు లేని ఆస్తులు, శాశ్వతంగా భూమి భద్రత, రీసర్వే సెటిల్‌మెంట్‌ రికార్డులు, 1-బి ప్రతుల పరిశీలన, కోర్టు కేసుల విషయాలు, అన్యాక్రాంతమైన భూములు వంటి అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖకు 4.09 లక్షల ఎకరాలు భూములున్నట్లు గుర్తించామని మంత్రి కె సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అన్యాక్రాంతమైన దేవాదాయశాఖకు చెందిన రూ.500 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మే 12 నుంచి 17 వరకు విజయవాడలో 500 మంది రుత్వికులతో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహా యజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో దేవాదాయశాఖ కమిషనరు సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్లు, 26 మంది అసిస్టెంట్‌ కమిషనర్లు, ఆలయ ఇఒలు పాల్గొన్నారు.