ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ళ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉండిలో తడిచిపోయిన ధాన్యాన్ని పంట పొలాలను సిపిఐ నేతలు శనివారం ఉదయం పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ముప్పల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ... పక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రైతుల కోసం ఆలోచిస్తూ పంట నష్టపరిహారాన్ని విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. రైతులకు కావలసిన టార్పాలిన్లు గోనె సంచులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక లాంటి పదాలు వాడుకలోనే తప్ప ఆచరణలో సాధ్యం చేయడంలేదని అన్నారు. తడిచిపోయిన ధాన్యాన్ని వెంటనే తేమ శాతాన్ని లెక్కచేయకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించాలని కోరారు. తడిచిన ధాన్యాన్ని పూర్తిగా రైతుల వద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు, సిపిఐ ఉండి ఏరియా కార్యదర్శి కలిశెట్టి వెంకటరావు, సిపిఐ నాయకులు సనపల శ్రీనివాస్, పూసపాటి వెంకటరామరాజు, తమరాని శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.










