Jun 27,2023 11:45

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చిన్నారులకు అందించే ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ ఏడాది నార్పల ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదివే 14 మంది విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో రెసిడెన్షియల్‌ సీట్లు సాధించారని, ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కొక్క రెసిడెన్షియల్‌ సీటు సాధించడానికి విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వడానికి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయిందని అన్నారు. ప్రతి విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల బట్టలు, పుస్తకాలు, బూట్లు అందివ్వడంతోపాటు ప్రతి పాఠశాలలోనూ నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వ బడి మన అందరి బడి అని పాఠశాలలో ఏవైనా సౌకర్యాలు లేకపోయినా, ఎలాంటి డబ్బు కట్టకపోయినా ప్రశ్నించే హక్కు ఉంటుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించినవారి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ప్రశ్నించే అవకాశం ఉండదని, పిల్లల మీద ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఉండే జవాబుదారీతనం ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయినీలు, ఉపాధ్యాయులు సువర్ణ, మంజుల, మహబూబ్‌ బాషా, రవికుమార్‌, లింగాన్ని, సరోజ, కఅష్ణవేణి, రాజేష్‌, హేమలత. అటెండర్‌ పార్వతమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.