ప్రజాశక్తి-చిత్తూరు : నగరపాలక పరిధిలో 43, 44వ వార్డుల పరిధిలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, పారిశుద్ధ్య నిర్వహణను నగర కమిషనర్ డా. జె అరుణ మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ రంగాచారి వీధి, పాత మార్కెట్ వీధి, బ్రాహ్మణ వీధి, బజార్ వీధి ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వీధుల్లో ఎక్కడా వ్యర్ధాలు ఉండరాదని, తడి, పొడిగా వేరుచేసి తరలించాలన్నారు. పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు తమ విధుల నిర్వహణకు సంబంధించి రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. అనంతరం మురుగునీటి కాలువల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. మురుగు నీటి కాలువల నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా లెవెలింగ్ ఉండాలన్నారు. కాలువల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పనులు త్వరగా పూర్తిచేసేలా సమన్వయం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈ వెంకట ప్రసాద్, ఎంహెచ్వో డా. లోకేష్, ఏఈలు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.










