ప్రజాశక్తి-వీకోట(చిత్తూరు) : రాయలసీమ ప్రాంతంలో చేపట్టిన పలు నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా పోలీసులపై టిడిపి నేతలు దాడిని ఖండిస్తూ చేపట్టిన చిత్తూరు జిల్లా బంద్‌లో భాగంగా వి.కోటలో శనివారం జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసిగా ఈ ప్రాంతం ప్రజానీకాన్ని నీరు కార్చే చర్యలకు పాల్పడ్డారన్నారు. ప్రస్తుత వైసిపిప్రభుత్వం హంద్రీనీవా కాలువపై చేపట్టిన నాలుగు ప్రాజెక్టులను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా డిసెంబర్ లోపు కుప్పానికి హంద్రీవా జలాలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో పుంగనూరులో వారు మాట్లాడిన భాష సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని తెలిపారు. వీటిని గమనిస్తున్న ప్రజలు తగిన సమయంలో సరియైన గుణపాఠం నేర్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఎంపీపీ యువరాజ్, మండల పార్టీ అధ్యక్షులు బాల గురునాథ్, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రెడ్డి, తమీంఖాన్, వి కోట ఉపసర్పంచ్ అక్మల్, ఏఎంసి ఉపాధ్యక్షులు ఎమ్మార్ ఆంజనేయులు పలువురు సర్పంచులు , ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.










