Apr 02,2023 12:53

పెంటపాడు (పశ్చిమ గోదావరి) : పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం నుండి రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు, రైతు సంఘం ఆధ్వర్యంలో జీపు ప్రచార యాత్ర జరుగుతుంది. ఆదివారం ఈ ప్రచార యాత్రని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు, నాయకులు బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ ... ఈనెల 5వ తేదీన ఢిల్లీ నగరంలో లక్షలాదిమంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు పెద్ద ఎత్తున పాల్గనాలని పెంటపాడు మండలంలో గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రచార నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విధానాల వల్ల రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అప్పజెప్పడం వల్ల కార్మిక వర్గం కట్టు బానిసలాగా మారిందని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకానికి కోత విధించడం వల్ల ఉపాధి కూలీలకు పనులు తగ్గాయని అన్నారు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు లేని కారణంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల వ్యవసాయ రంగంకి దూరం అవుతున్నారని ఈ విధానాలకి వ్యతిరేకంగా రేపు ఐదో తారీఖున పెద్ద ఎత్తున చేపట్టనున్న చలో ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతు శ్రీను, కరక వెంకట్రావు, పెనగంటి దుర్గా, కల్లంపూడి మాదాసు రమేష్‌, కుసంపూడి చందు, కాటా నరేష్‌, కోటాని రవి, ఎడవీల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.