ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : జూలై 12, 13, 14 వ తేదీల్లో అనంతపురంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం కడవకల్ వైఎస్సార్ సర్కిల్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ ... ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న ధరలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జూలై 12 నుండి 14 వరకు అనంతపురం నగరంలో జరుగుతున్నాయని ప్రకటించారు. ఈ సమావేశాలకు పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులుచ, ఎంఏ బేబి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసులు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, మాజీ పార్లమెంట్ సభ్యులు పి.మధు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సిపిఎం నాయకులు ఈ సమావేశాల్లో పాల్గనేందుకు అనంతపురం నగరానికి రానున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ ఆర్థిక, సామాజిక పరిస్థితులను సమీక్షించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకునేందుకు ఈ సభలు జరుగుతున్నాయన్నారు. ఇదొక అరుదైన సందర్భం అన్నారు. ప్రజల పక్షం నుంచి పరిస్థితులను పరిశీలించి ప్రజాక్షేత్రం లక్ష్యంగా సిపిఎం తన రాజకీయ విధానాన్ని నిర్ణయించుకుంటుందన్నారు. ఈ విధాన నిర్ణయాన్ని ఒకరిద్దరు నాయకులు నిర్ణయించబోరని, మహాసభల ద్వారా ఎన్నికైన రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశాల్లో విస్తృతంగా చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 9 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం పెట్రోలు, డీజలు, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచిందన్నారు. ఆర్థిక విధానాల వల్ల దేశాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నదని దుయ్యబట్టారు.










