Apr 16,2023 12:48

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక, ఉద్యోగ ,ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం పేర్కొన్నారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరిని పాలకొల్లులో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్షాలైన టిడిపి, జనసేనలు కేంద్ర ప్రభుత్వ, మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అచ్చేదిన్‌ అంటూ ప్రచారం చేసి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ప్రజలను సచ్చేదిన్‌ చేసిందని విమర్శించారు. ధరలు, నిరుద్యోగం దించుతామని చెప్పి వీటిని పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. కొత్త పరిశ్రమల సంగతి ఎలా ఉన్నా ఉన్న పరిశ్రమలు మూసేయడమో, ప్రైవేట్‌ పరం చేయడమో చేస్తోందని విమర్శించారు. రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పోరాటం చేయవలసిన దుస్థితి ఉందని చెప్పారు. ఇంకా మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ ,సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, బాతిరెడ్డి జార్జ్‌ వలవల శ్రీరామమూర్తి,దేవ సుధాకర్‌ పాల్గొన్నారు.