Aug 07,2023 11:13

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : కర్నూలు జిల్లా, ఆదోని, సమగ్ర అభివృద్ధికి రూ.పది వేల కోట్లు కేటాయించాలని కోరుతూ ... ఆదోని నుండి కర్నూలు వరకు సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా ... సోమవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్‌ ముందు మహాధర్నా చేపట్టారు. పలు వాహనాల్లో వందలాదిమంది సిపిఎం కార్యకర్తలు ఈ ధర్నాకు వచ్చారు.
     ఆదోని నుండి ప్రారంభమైన సిపిఎం మహా పాదయాత్ర సోమవారం కర్నూలుకు చేరుకుంది. కర్నూల్ నగరంలోని బళ్లారి చౌరస్తా నుండి వేలాదిమందితో ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనకు సిపిఎం పోలీట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి అగ్ర భాగాన నడిచారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బి.వి రాఘవులు సమాధానం ఇస్తూ.. కర్నూలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వలసలు నివారించాలని కోరారు. జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు లేనందున బెంగుళూరు హైదరాబాద్ లాంటి మహానగరాలకు యువత కూలీలు కార్మికులు వెళ్తున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రూ పదివేల కోట్లు కేటాయించాలని సిపియం పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న బుందేల్ఖండ్ తరహా ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ .... కర్నూలు జిల్లా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉందని, అలాగే ఆదోని నియోజకవర్గం కూడా పూర్తిగా వెనుకబడి ఉందని, సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉందని అన్నారు. వీటన్నిటి పరిష్కారం కోసం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి, రామాంజనేయులు, పాండవగల్‌ గ్రామ సర్పంచ్‌ కే.ఉమాదేవి, మండల నాయకులు రామాంజనేయులు, అయ్యప్ప, భాష, హనుమంత్‌ రెడ్డి, నాగరాజు, శాఖ కార్యదర్శులు ముత్తన్న, కే.పాండురంగ, కే.గోవిందు, ఎస్‌.అనిఫ్‌ భాష, జి.విరుపాక్షి, ఈ.వీరేష్‌, లక్ష్మన్న, శ్రీనివాసులు, రామాంజనేయులు, జి.పరమేష్‌, నాగరాజు, ఆయా గ్రామాల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

kurnool

 

kurnool maha padayatra