తణుకు రూరల్ : ఏపీకి ప్రత్యేక హౌదా, విభజన హామీలు అమలు చేయని, బిజెపికి వ్యతిరేకంగా వైసిపి ఎందుకు పోరాటం చేయడం లేదని సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి పీవీ.ప్రతాప్ ప్రశ్నించారు. శనివారం తణుకు రూరల్‌లోని స్థానిక కప్పల వెంకన్న సెంటర్ వద్ద రాజకీయ ప్రచార భేరి యాత్రలో భాగంగా ... బహిరంగ సభ కరపత్రాలను సిపిఎం -సిపిఐ ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్, నాగరాజు లు మాట్లాడుతూ... ఏపీ కి జరిగిన అన్యాయం పై వామపక్షాలు పోరాటం చేస్తున్నాయన్నారు. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కేంద్ర హామీల విషయంలో నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టినప్పటికీ వైసిపి చూసీచూడనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు. నిరంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబాని, ఆదానిలాంటి వారి కోసం మోడీ పనిచేస్తున్నారు తప్ప, దేశ ప్రజలకు ఏమిచేయడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు గార రంగారావు, కామన మునిస్వామి, సిపిఐ గుబ్బల వెంకటేశ్వరరావు, నుడగల అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.










