ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలని తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చిర్లపుల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపద్యక్షలు సిరపరపు రంగారావు, తేతలి నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక రైల్వే గూడ్స్ షెడ్ వద్ద రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షలు సత్తి కోదండ రామిరెడ్డి అధ్యక్షతన నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 2014లో 414 ఉన్న గ్యాస్ ధర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 1200 రూపాయలకు చేరుకుందని,19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 2000 రూపాయలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క సంపన్నులకు రాయితీలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై భారాలు మోపుతున్నదని వాపోయారు. గ్యాస్ ధరలను తగ్గించకపోతే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విఎస్ రెడ్డి, కార్తీ సుబ్బిరెడ్డి, అడపా ఆంజనేయులు, ఆకుల నారాయణ, మద్దాల పుత్రియ్య, గాది వెంకట్రావు, బుద్ధాల నాని, అడ్డగర్ల కృష్ణ, ధనలక్ష్మి, రమ, రైల్వే గూడ్స్ షెడ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










