Aug 21,2023 15:10

ప్రజాశక్తి- అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ పారిశుద్య ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 24వ తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం నగరంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో కార్మికులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యస్‌.నాగేంద్ర కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర నుండి బైకు ర్యాలీ ప్రారంభమైన ర్యాలీ టవర్‌ క్లాక్‌, శ్రీ కంఠం సర్కిల్‌, పాత ఊరు గాంధీ సర్కిల్‌ మీదుగా తిరిగి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరింది. ఈ ర్యాలీలో పారిశుద్ధ్య ఇంజనీరింగ్‌ జిల్లా కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు. జిల్లా మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం సిఐటియు అనుబంధం జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కే.నాగభూషణ, సిఐటియు నగర ఓల్డ్‌ టౌన్‌ కార్యదర్శి వై.వెంకట నారాయణ, పారిశుధ్య, ఇంజనీరింగ్‌ విభాగపు జిల్లా,నగర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సిఐటియూ అనుబంధ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు.